బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ?
- బెంగాల్ లో బీజేపీ ఘన విజయం
- గంగూలీతో సుదీర్ఘంగా భేటీ అయిన బీజేపీ నేత పాఠక్
- దాదాను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బీజేపీ నేత పీఎన్ పాఠక్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటమి చెంది, బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో గంగూలీ నివాసంలో జరిగిన ఈ సుదీర్ఘ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సౌరవ్ గంగూలీ నివాసంలో పీఎన్ పాఠక్ సుమారు రెండు గంటలకు పైగా గడపడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదని, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీ, బీజేపీల మధ్య పోరాటం ముగిసి, బీజేపీ అధికార బాధ్యతలు చేపట్టబోతున్న వేళ, బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న గంగూలీని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తమ పట్టును మరింత బలపరుచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ గంగూలీ రాజకీయ అరంగేట్రంపై పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఆయన క్రీడారంగానికే పరిమితమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, గంగూలీ పార్టీలోకి వస్తే బాగుంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.